పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:తమ పట్టా భూములను ఆక్రమించేందుకు కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తవణంపల్లి మండలం కరణంవాండ్లఊరు దళితవాడకు చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న కంచెను అర్ధరాత్రి వేళ తొలగించి ఆక్రమణకు ప్రయత్నించారని, ప్రశ్నించిన తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు స్పందించడం లేదని వాపోయారు.చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ.. నలిశెట్టిపల్లి లెక్కదాఖలాలోని సర్వే నంబర్ 178/2లో తమకు పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. ఆ భూములను పరిరక్షించుకునేందుకు కంచె ఏర్పాటు చేసుకుని భద్రపరుచుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ నెల 11వ తేదీ రాత్రి బీసీ కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు తమ భూముల వద్దకు వచ్చి కంచెను, కూసాలను తొలగించి ఆక్రమించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.ఈ విషయాన్ని ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగడంతో ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్లిపోయామని బాధితులు తెలిపారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో తవణంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించామని, అయితే పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించారు.భూముల ఆక్రమణ యత్నంపై తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూములను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.అధికారులు స్పందించాలి.. న్యాయం చేయాలి.తమ భూముల విషయంలో జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించాలని బాధితులు కోరారు. భూములపై సమగ్ర విచారణ జరిపించి, ఆక్రమణ యత్నాలను అడ్డుకోవాలని, తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బాధితులు అనిల్ కుమార్, భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్