telangana
దుర్కి గిరిజన గురుకులంలో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు.
Telangana
15 Nov 2026
32 views
సూర్య నసురుల్లాబాద్ : మండల పరిధిలో గల దుర్కి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల విద్యాలయంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్కూరు కానిస్టేబుల్ బుజ్జి బాయ్, ఉపాధ్యాయుడు శివలాల్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్, బంజారా కవి బాల్ సింగ్ రాథోడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. నేటితరం యువతలో సామాజిక సేవాభావాన్ని పెంపొందించి, యువ నాయకత్వాన్ని తయారు చేయాలనే సంకల్పంతో మేరా యువ భారత్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. భగవాన్ బిర్సా ముండా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, వారి హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, బలవంతపు మతమార్పిడులు, భూమి హక్కుల సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి గిరిజన సమాజంలో చైతన్యం నింపారని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల సేవలు, త్యాగాలను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల ద్వారా మహనీయుల చరిత్రను యువతకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. భారతదేశంలో 12 కోట్ల బంజారా జాతిని ఏకం చేసిన బంజారా ఆరాధ దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి భారత పార్లమెంట్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అన్నారు.బీర్కూరు కానిస్టేబుల్ బుజ్జి బాయ్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన నాయకుల పాత్ర ఎంతో కీలకమని, అతి చిన్న వయసులోనే బిర్సా ముండా గిరిజనుల హక్కుల కోసం పోరాడి అమరుడయ్యారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థినులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు.ఉపాధ్యాయుడు, తెలుగు పండిట్ శివలాల్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పాత్ర ఎంతో గొప్పదని, అయితే సరైన గుర్తింపు, చారిత్రక ప్రాధాన్యత లభించకపోవడంతో వారి త్యాగాలు చాలావరకు మరుగునపడ్డాయన్నారు. జనజాతీయ గౌరవ దివస్ ద్వారా అలాంటి మహనీయుల చరిత్రను గుర్తుచేసుకోవడం సంతోషకరమన్నారు. విద్య ఒక్కటే మన తలరాతను, దేశ భవిష్యత్తును మార్చగల శక్తి అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారని, విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు చిత్రలేఖన పోటీలు బంజారా సాంస్కృతిక నృత్యాలను చేయించారు వారికి బహుమతులను అతిధుల చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News