యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అన్ని రంగాల్లో ముందుండాలి -- యువకులకు వాలీబాల్ నెట్ కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదవేగి , మేజర్ న్యూస్ :నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మెరుగైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. చదువుతో పాటు క్రీడలు సహా అన్ని రంగాల్లో యువత అగ్రగామిగా నిలిచినప్పుడే గ్రామాలు, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం జానంపేట ప్రకాష్ నగర్ మీదుగా ఎమ్మెల్యే వెళ్తుండగా, అక్కడ ఉత్సాహంగా వాలీబాల్ ఆడుకుంటున్న యువకులు ఆయన వాహనాన్ని చూసి ఆనందంతో కేరింతలు కొట్టారు. వెంటనే కారు నిలిపిన ఎమ్మెల్యే చింతమనేని వద్దకు యువకులంతా ఉత్సాహంగా తరలివచ్చారు. సెలవు రోజున వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపడాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన యువతనుద్దేశించి మాట్లాడారు. అనంతరం ఆటకు అవసరమైన వాలీబాల్ నెట్ కొనుగోలు కోసం యువకులు కోరగానే, అక్కడికక్కడే రూ.10 వేల నగదును ఎమ్మెల్యే అందజేశారు. తమను ప్రోత్సహించి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ప్రకాష్ నగర్ యువకులు కృతజ్ఞతలు తెలిపారు.