వైఎస్సార్‌సీపీ ప్రచారానికి గణాంకాలతోనే సమాధానం: చిన్న శ్రీను
విజయనగరం, మేజర్ న్యూస్:
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ పరిశీలకులు, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. ఆదివారం విజయనగరం ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల గణాంకాలను వక్రీకరించడం తగదు:
నవంబర్ 5న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో 76.21 శాతం తుది పోలింగ్ నమోదైందని, ఇది రాష్ట్ర సగటు (70.72 శాతం) కంటే ఎక్కువని చిన్న శ్రీను వివరించారు. జిల్లాలో మొత్తం 12,85,692 మంది ఓటర్లు ఉండగా, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు సుమారు 3.95 లక్షల ఓట్లు వచ్చాయని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారని, కేవలం ఓట్ల సంఖ్యను మాత్రమే చూపించి రాజకీయంగా అనుకూల వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా నెల్లిమర్లలో 88.25%, గజపతినగరంలో 86.44%, చీపురుపల్లిలో 83.48%, ఎస్.కోటలో 85.45%, బొబ్బిలిలో 80.34%, రాజాంలో 76%, విజయనగరంలో 71.84% పోలింగ్ నమోదైందని గుర్తుచేశారు. గత గణాంకాలతో పోల్చేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలు:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు రాగా, 'పార్టనర్‌షిప్ సమ్మిట్-2026' ద్వారా మరో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 303 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదిరాయని చెప్పారు. వీటి ద్వారా 3,48,309 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని, దీంతో మొత్తం పెట్టుబడి ప్రతిపాదనలు రూ.32.49 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించారు. గతంలో వచ్చిన 714 ప్రతిపాదనల్లో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలు మంజూరు కాగా, రూ.7.30 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించకుండా విమర్శలు చేయడం తగదన్నారు.
2029 ఎన్నికల విజయమే లక్ష్యం:
రానున్న 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని చిన్న శ్రీను పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు భయపడవద్దని, పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం