పశుగ్రాస సాగుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం
కలిగిరి, మేజర్ న్యూస్ : బహువార్షిక పశుగ్రాసాల సాగుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలిగిరి మండల ఎంపీడీవో కే. ప్రత్యూష అధికారిక ప్రకటనలో తెలిపారు. పాడి రైతులు, పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. రైతులు 10 నుంచి 50 సెంట్ల వరకు పశుగ్రాసం సాగు చేసుకోవచ్చని, సాగు విస్తీర్ణాన్ని బట్టి మొదటి సంవత్సరం రూ.6,599 నుంచి రూ.32,992 వరకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.దరఖాస్తు చేసుకునే రైతులు ఉపాధి హామీ జాబ్ కార్డు, భూమి 1-బి, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులను సమర్పించాలని ఎంపీడీవో తెలిపారు. ఆసక్తి గల రైతులు సమీప రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.