పరిసరాల పరిశుభ్రతే అందరి లక్ష్యం
పార్వతీపురం, సూర్య : కొత్తవలసలో వైభవంగా "మన వీధి - మన బాధ్యత" కార్యక్రమం పార్వతీపురం పరిధిలోని కొత్తవలస ప్రాంతంలో పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా "మన వీధి - మన బాధ్యత" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ రాంగోపాల్ మాట్లాడుతూ, వీధులను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇళ్ల వద్దే తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని, మురుగు కాలువలలో చెత్త వేయకుండా జాగ్రత్తలు వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తవలసలోని మోండి వీధి, పెద్ద వీధిలతో పాటు సచివాలయం-4 పరిధిలోని 8, 9వ వార్డులు మరియు 9వ వార్డు విజయరామరాజు కాలనీలలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పారిశుధ్య కార్మికులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.