andhrapradesh
పాత్రికేయులకు ఘన సత్కారం....బ్రిలియంట్ పాఠశాలలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు
టెక్కలి, నవంబర్ 16, మేజర్ న్యూస్:
అక్షర యోధుల సేవలను స్మరించుకుంటూ, జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని టెక్కలిలోని బ్రిలియంట్ పాఠశాలలో సోమవారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి ఆధ్వర్యంలో స్థానిక పత్రికా విలేకరులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. పర్యావరణ స్పృహను చాటుతూ విలేకరులకు పచ్చని పూల మొక్కలను బహూకరించిన ప్రధానోపాధ్యాయురాలు, దుశ్శాలువలతో వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పత్రికా రంగం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం వంటిదని అభివర్ణించారు. నిష్పక్షపాత వార్తలతో సమాజాన్ని జాగృతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా నిలుస్తున్న విలేకరుల నిబద్ధత ఎందరికో ఆదర్శమని కొనియాడారు. కలాన్ని ఆయుధంగా చేసుకుని నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు.
– రిపోర్టర్ గంటా అప్పన్న