నీటి సరఫరా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.....
విజయనగరం మేజర్ న్యూస్: నగరంలో నీటి పంపిణీలో అక్కడక్కడ రంగు మారిన నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని నగర మేయర్ అవనాపు భార్గవి ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో ఈరోజు సమావేశం అయ్యారు. రంగు మారిన నీటి సరఫరాకి తగు కారణాలను అడిగి తెలుసుకున్నారు. వాటి శాశ్వత పరిష్కారానికి చేపట్టబోయే అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నగరంలో నీటి పంపిణీలో రంగు మారిన నీటి సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించామన్నారు. ఈ అంశమై శాశ్వత పరిష్కారానికి అమృత్ 2.0 ద్వారా నిధులను వెచ్చించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలో మధుపాడ రిజర్వాయర్ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించనున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం మరియు ప్రజారోగ్య సాంకేతిక శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. వర్షాలు కురిసే సమయంలో ఎగువ నుండి రంగు మారిన నీరు మధుపడ రిజర్వాయర్ కు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలియజేశారని అన్నారు. రంగు మారిన నీటిలో ఆలం కలపడంతో పాటు, క్లోరినేషన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అయినా గాని ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరమని వెల్లడించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ అవనాపు విజయ్, డి ఈ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.