నామినేషన్ల గడువు పెంపునకు నిరాకరణ
న్యూఢిల్లీ:నామినేషన్ల సమయాన్ని పొడిగించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. నామినేషన్ల గడువును పెంచలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పూర్తిగా పాటించామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) న్యాయస్థానానికి తెలిపింది.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా నమోదైన సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. బెదిరింపులు లేదా ఇతర కారణాల వల్ల నామినేషన్లు వేయలేకపోయిన వారు ఉంటే, వారు తమ అభ్యంతరాలపై చట్టప్రకారం విడిగా పిటిషన్ వేసుకోవచ్చని సూచించింది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.