నామినేషన్ స్వీకరణలో వివక్ష చూపారంటూ ఆవేదన
కొసమాలలో సర్పంచ్ అభ్యర్థి ధ్రువపత్రాలు చించేశారని ఆరోపణలు
మెలియాపుట్టి. నవంబర్ 20. మేజర్ న్యూస్....
నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థిని అడ్డుకుని, ఆమె చేతిలోని అసలు ధ్రువపత్రాలను చించివేశారని కొసమాల గ్రామంలో జనసేన, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. సర్పంచ్ అభ్యర్థి శిష్టు లక్ష్మిని పక్కకు తోసి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, చివరి నిమిషంలో సమయం ముగిసిందనే కారణంతో ఆమె నామినేషన్ తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై నాయకులు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.
మెలియాపుట్టి మండలంలోని కొసమాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి శిష్టు లక్ష్మితో పాటు వార్డు సభ్యులుగా జొన్న ముద్దమ్మ, వట్టికుళ్ల రాజేశ్వరి, ఉర్లాన నీలవేణి, శ్రీరాం ప్రశాంత్, అంధవరపు ఇందిరమ్మ నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు గ్రామానికి చెందిన టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి అడ్డుకున్నారని జనసేన, వైఎస్సార్సీపీ నాయకులు వంశీ, మాణిక శివ, రాకేశ్, వట్టికుళ్ల శివ, కలవల బాబురావు, మాణిక గణేష్ ఆరోపించారు.
సర్పంచ్ అభ్యర్థి శిష్టు లక్ష్మి చేతిలోని అసలు ధ్రువపత్రాలను చించివేసి, మహిళ అని కూడా చూడకుండా పక్కకు తోసేశారని ఆమె తెలిపారు. ఐదుగురు వార్డు సభ్యుల నామినేషన్లను స్వీకరించినప్పటికీ, సర్పంచ్ అభ్యర్థి నామినేషన్‌ను చివరి నిమిషంలో సమయం ముగిసిందనే కారణంతో తిరస్కరించినట్లు నాయకులు పేర్కొన్నారు.
నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత అభ్యర్థి, నాయకులు కోరారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగడంతో పాటు అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో కొసమాల గ్రామంలో ఎన్నికల వాతావరణం ఉద్రిక్తంగా మారింది.