మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిపై వైకాపా నాయకుల తీవ్ర ఆగ్రహం.
కావలి మేజర్ న్యూస్ : కావలి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల విస్తరణ అస్తవ్యస్తంగా ఉందని, దీనిపై వెంటనే నూతన ఓటర్ల జాబితాను ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అధికారుల వైఖరిని నిరసిస్తూ, అవసరమైతే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బుధవారం కావలి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్‌ను కలసి పలుమార్లు వివరణ కోరినప్పటికీ, బుధవారం మధ్యాహ్నం వరకు ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైకాపా నేతలు మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్నా నేటి వరకు కనీసం నోటీసు బోర్డులో ఎలక్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంచకపోవడంపై నిలదీశారు. కాగితాలను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కుపోయారని కమిషనర్ చెప్పిన సమాధానం వింటే ప్రజలు అవాక్కవుతున్నారని, కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పందిటి కామరాజు మాట్లాడుతూ, వార్డుల్లో సరిహద్దులు, ల్యాండ్ మార్కులు చూపించకుండా అస్తవ్యస్తంగా వార్డులను విస్తరించడంతో సాధారణ ఓటర్లందరూ అయోమయానికి, గందరగోళానికి గురవుతున్నారు. అధికార పార్టీ నేతలకు స్పష్టమైన సమాధానాలు చెబుతూ, ప్రతిపక్ష నాయకుల పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. అధికారుల తీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది" అని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో వైకాపా వార్డు ఇన్చార్జులు కనపర్తి రాజా, నాయబ్ రసూల్, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మండలి కృష్ణారావు, ద్రోణాదుల వెంకటరావు, కుందుర్తి కామయ్య, కన్నమర్లపూడి నారాయణ, గుడ్లూరు మాల్యాద్రి, మహిళా నాయకురాళ్లు వెంగళ శెట్టి కళ్యాణి, శిరీష, అనుషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.