మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలి* *నామినేషన్ పత్రాలు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యర్థులకు రసీదులు అందజేయాలి* *నామినేషన్ కేంద్రంలో రికార్డుల నిర్వహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కర్నూలు, నవంబర్ 21: మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల మేరకు ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
శనివారం కర్నూలు రూరల్ మండల పరిధిలోని దిన్నెదేవరపాడు స్వర్ణ గ్రామ కార్యాలయంలో నిర్వహిస్తున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్..నామినేషన్ల స్వీకరణ విధానం, అభ్యర్థులు సమర్పిస్తున్న నామినేషన్ పత్రాలు, వాటికి జత చేస్తున్న ధ్రువపత్రాలు, రిజిస్టర్ల నిర్వహణ, అభ్యర్థులకు అందిస్తున్న సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలను చెక్‌లిస్ట్ ప్రకారం పరిశీలించి నమోదు చేస్తున్నారా, నామినేషన్లు స్వీకరించిన అనంతరం సంబంధిత రసీదులు అందజేస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు. అభ్యర్థుల వారీగా, వార్డుల వారీగా ప్రత్యేక రిజిస్టర్లు నిర్వహిస్తూ అభ్యర్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, నామినేషన్ సమర్పించిన సమయం, రుసుము చెల్లింపు వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. అలాగే అభ్యర్థులకు అవసరమైన చెక్‌లిస్టులు, ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఫారాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నామినేషన్ల సమర్పణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మార్గదర్శకాలు అందించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు నామినేషన్ పత్రాల భర్తీలో సహకారం అందించేందుకు హెల్ప్‌డెస్క్ సేవలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను స్వీకరించి, వాటి వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అవసరమైన సూచనలు ముందుగానే తెలియజేయాలని, ప్రతి దశలోనూ ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో ఇప్పటివరకు స్వీకరించిన నామినేషన్ల సంఖ్య, వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ తనిఖీలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కర్నూలు రూరల్ తహశీల్దార్ వెంకట రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.