మిట్స్ వర్శిటీలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన కర్ణాటక ఉన్నత విద్యామండలి సభ్యులు డాక్టర్ టి.డి కెంపరాజు
కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు-2026ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు నార్త్ యూనివర్సిటీ ఫార్మర్ వైస్ ఛాన్సల్లర్,కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సభ్యులు డాక్టర్ టి.డి కెంపరాజు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పొందడానికి ప్రధాన కేంద్రాలని,విద్యార్థుల విద్యాభివృద్ధి,వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడంతోపాటు ఆలోచనా విధానం,సృజనాత్మకత,విశ్లేషణాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయని తెలిపారు.విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.నేటి డిజిటల్ యుగంలో గ్రంథాలయాలు పుస్తకాలతోపాటు డిజిటల్ విజ్ఞాన వనరులను కూడా అందిస్తున్నాయని,వాటిని విద్యార్థులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.పుస్తక పఠనం విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు,పరిశోధనా దృక్పథానికి,సమస్యలను విశ్లేషించి పరిష్కరించే సామర్థ్యానికి పునాది వేస్తుందన్నారు.జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించడంతోపాటు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించవచ్చని తెలిపారు.ఇందులో భాగంగా చిత్రలేఖనం,వ్యాసరచన,వక్తృత్వ పోటీలు నిర్వహించి,గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్స్,బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్,లైబ్రరీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఎన్.గంగిశెట్టి,లైబ్రేరియన్ డాక్టర్ ఎం.సురేష్ బాబు,అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి