మర్రిపల్లిలో సోమిరెడ్డి ఎన్నికల ప్రచారం..
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేయబోతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం బిరదవోలు సెగ్మెంట్ పరిధిలోని మర్రిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరడంతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. మరోవైపు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధే అజెండాగా ప్రజల్లోకి వెళ్లండి
టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సోమిరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలకు చేసిన పనులను వివరించి, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే అభ్యర్థులను ఆదరించాలని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అరాచకం రాజ్యమేలిందని విమర్శించారు. ప్రజలు అభివృద్ధిని ఆదరించి, అరాచక వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు కలిచేటి ప్రభాకర్‌రెడ్డిని, బిరదవోలు ఎంపీటీసీ అభ్యర్థి అన్నలూరు సుమలతను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభాకర్‌రెడ్డి సౌమ్యుడైన సీనియర్ నాయకుడని, ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన ఉన్నత విద్యావంతురాలు అన్నలూరు సుమలత అని పేర్కొంటూ వారి విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
సీజేఎఫ్ఎస్ భూములకు డీకేటి పట్టాలిచ్చిన ఘనత టీడీపీది
తాను మంత్రిగా ఉన్న సమయంలో 2018లో జిల్లా వ్యాప్తంగా 70 వేల ఎకరాలకు, సర్వేపల్లి నియోజకవర్గంలో 7 వేల ఎకరాలకు, పొదలకూరు మండలంలో 1,100 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములకు డీకేటీ పట్టాలు అందజేసినట్లు సోమిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరగడంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరిందన్నారు. అదే సమయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన సొంతూరులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు సాగు చేసుకుంటున్న 127 ఎకరాలకు ఇప్పటివరకు పట్టాలు ఇప్పించలేకపోయారని ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కారంలో గత పాలకుల వైఫల్యాలను ప్రజలు గమనించాలని వ్యాఖ్యానించారు.
సర్వేపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు టీడీపీలో చేరుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నాయకత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పొదలకూరు మండలంలో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
మర్రిపల్లిలో పలువురు టిడిపిలో చేరిక
మర్రిపల్లిలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సోమిరెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వెంపులూరు రామచంద్రయ్య గౌడ్, రావుల అంకోజి, పచ్చురు లక్ష్మయ్య, రాచగుంట దశయ్య, సమిడిబోయిన జనార్దన్, వెంపులూరు విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. మొత్తంగా పరిషత్ ఎన్నికల వేళ పొదలకూరు మండలంలో ప్రచారాన్ని ఉధృతం చేయడంతో పాటు, ఇతర పార్టీల నుంచి చేరికలపైనా టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.