బీసీ’ విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం
అమరావతి : అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. తాజా ఆహారం, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే అందజేయాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మాధవీలతతో ఆమె ఫోన్ లో మంగళవారం మాట్లాడారు. తుఫాన్ వల్ల 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల్లో బీసీ సంక్షేమ, గురుకులాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకూ సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో విధుల్లో ఉన్న అధికారులు సైతం ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో బలహీనంగా ఉన్న భవనాల నుంచి సురక్షిత భవనాల్లోకి విద్యార్థులను తరలించాలన్నారు. వేడి చేసి చల్లార్చిన నీటిని, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టంచేశారు. బయట ఆహారం హాస్టళ్లలోకి, గురుకులాల్లోకి అనుమతించొద్దన్నారు. వర్షాల కారణంగా హాస్టళ్లు, గురుకులాల్లో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తరగతి గదులు, విశ్రాంతి గదుల్లో పొడి వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థులకు చిన్నపాటి అస్వస్థత కలిగినా తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలాంలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశమివ్వొద్దని స్పష్టంచేశారు. అవసరమైన చోట సిబ్బంది సెలవులు రద్దు చేయాలని, బీసీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.