పామూరులో టీడీపీ క్లీన్‌స్వీప్
- 18 ఎంపీటీసీ స్థానాలూ ఏకగ్రీవం
- టీడీపీకి 17 జనసేనకు ఒక స్థానం
- విజేతలకు ఫారం 10 పత్రాలు అందజేత
పామూరు, మేజర్ న్యూస్ : పామూరు మండల ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. మండల పరిధిలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా వాటిలో టీడీపీ 17 స్థానాలను, జనసేన ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 58 నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఉపసంహరణకు అవకాశం ఉన్న 41 నామినేషన్లలో టీడీపీకి చెందిన 16, వైసీపీకి చెందిన మూడు, స్వతంత్ర అభ్యర్థులకు చెందిన నాలుగు చొప్పున మొత్తం 23 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని వెల్లడించారు. టీడీపీ తరఫున చిలంకూరు ఎంపీటీసీ స్థానానికి బరిలో నిలిచిన పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.శ్రీనివాస్ రెడ్డి ఫారం-10 ధ్రువపత్రాలను అందజేశారు. మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ స్థానాల్లో 17 టీడీపీ, ఒకటి జనసేన ఖాతాలో చేరడంతో ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో బ్రహ్మయ్య, టిడిపి ఒంగోలు పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు ఏలూరి వెంకటేశ్వర్లు, తూర్పుకోడిగుడ్లపాడు ఎంపీటీసీ పువ్వాడి వెంకటలక్ష్మి, టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ గుంటుపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.