అర్నబ్ తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత
- తీర ప్రాంత వాసులు మరింత జాగ్రత్తగా ఉండాలి
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
- నక్కపల్లి నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్
నక్కపల్లి (మేజర్ న్యూస్): అర్నబ్ తుపాను నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
నక్కపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల అధికారులతో మంగళవారం ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను తీవ్రత, ముందస్తు చర్యలు, ప్రజల భద్రతపై అధికారులకు పలు దిశానిర్దేశం చేశారు. అనంతరం ప్రజలకు పలు సూచనలు చేస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం
తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమై ఉందని హోంమంత్రి తెలిపారు. "ప్రతి మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు" అని పేర్కొన్నారు. తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
వదంతులు నమ్మవద్దు
తీర ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదని మంత్రి హెచ్చరించారు. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ స్తంభాలు, లైన్ల సమీపంలో ఎవరూ నిలబడవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అనవసర వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం జారీ చేసే అధికారిక సూచనలు, అధికారుల ఆదేశాలను మాత్రమే పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు