ప్రజల నమ్మకమే నా బాధ్యత
- ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి
- అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం
- ఎంపీటీసీ సభ్యుల సహకారంతో సమష్టిగా ముందుకు
- ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తా
- ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ : తనకు అప్పగించిన ఎంపీపీ బాధ్యతను ప్రజల సేవకు ఒక అవకాశంగా భావిస్తున్నానని పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారం మార్గదర్శకత్వంతో పామూరు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఎంపీపీ పదవిని హోదాగా కాకుండా ప్రజలకు మరింత చేరువగా సేవ చేసే బాధ్యతగా భావిస్తున్నానన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎంపీటీసీ సభ్యులందరినీ కలుపుకొని సమష్టిగా పనిచేస్తూ మండలానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రజలు ఏ సమస్యతో తన వద్దకు వచ్చినా అందుబాటులో ఉండి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మండలానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను సాధించేందుకు కృషి చేస్తానని పువ్వాడి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. తమపై నమ్మకం ఉంచిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.