మహిళా కబడ్డీ పోటీలకు ఎం.ఏ.ఎం విద్యార్థినుల ఎంపిక
నరసరావుపేట : సౌత్ జోన్ అంతర్ విశ్వ విద్యాలయాల మహిళా కబడ్డీ పోటీలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టులో ఎం.ఏ.ఎం విద్యా సంస్థలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ ఎంపికతో కేసనపల్లిలోని ఎం.ఏ.ఎం విద్యాసంస్థలకు క్రీడారంగంలో విశేష గుర్తింపు లభించింది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నవంబర్ 20, 21 తేదీల్లో నిర్వహించిన అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల్లో మొత్తం 14 మందితో యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఎం.ఏ.ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన ఏ. భారతి, ఎం.ఏ.ఎం డిగ్రీ కళాశాలకు చెందిన పి. మౌనిక స్థానం సంపాదించారు. డిసెంబర్ 7వ తేదీన మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాల యాల మహిళా కబడ్డీ పోటీల్లో వీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భం గా ఎం.ఏ.ఎం విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు మాట్లాడుతూ సౌత్ జోన్ జట్టుకు ఎంపికైన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించడం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిదర్శనమని, విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు సంస్థ ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.
సంస్థ డైరెక్టర్ దరువురి శ్రావ్య పృథ్వీరాజ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పోటీతత్వం పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థినులు చూపిన అంకితభావం కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఎం.ఏ.ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మంచినేని ప్రసాద్ రావు, ఎం.ఏ.ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దొండేటి చంద్రారెడ్డి విద్యార్థినులను అభినందించారు. క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడల్లో రాణించి సంస్థకు మంచి పేరు తీసుకువస్తున్న విద్యార్థులను యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. విద్యార్థినులకు నిరంతరం శిక్షణ మార్గదర్శకత్వం అందించిన ఫిజికల్ డైరెక్టర్లు సన్నీ, డేనియల్, శరత్ చంద్రలను ఈ సందర్భంగా యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థినులు సాధించిన ఈ విజయంపై ఎం.ఏ.ఎం విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే సౌత్ జోన్ పోటీల్లోనూ విజయం సాధించి యూనివర్సిటీకి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.