అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం
జగ్గయ్యపేట: పాలేటి ఒడ్డున వేంచేసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం పంచాయతన క్షేత్రం మఠం శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం బ్రహ్మశ్రీ ఇంగువ గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో, అర్చకులు కర్రెడ్ల మోహన్ శర్మ, రామకృష్ణ ల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.
ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం సుముహూర్తంలో శాస్త్రోక్తంగా స్వామి వారి కళ్యాణ క్రతువును కన్నులపండువగా జరిపించారు.
ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జగ్గయ్యపేట మరియు పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల హర హర మహాదేవ శంభో శంకర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై అనే నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కళ్యాణంలో 80 మంది దంపతులు పాల్గొన్నారు.
కళ్యాణోత్సవం అనంతరం ఆలయ కమిటీ మరియు దాతల సహకారంతో భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.
రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా