ఎన్నికలు ఏవైనా.. విజయం కూటమిదే! స్థానిక ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతం.. అభివృద్ధికి ప్రజల మద్దతు చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్.
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఏవైనా విజయం కూటమి పార్టీలదేనని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, కె. మురళీమోహన్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు గతంలో కంటే అధిక ఓట్ల శాతం లభించడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
సోమవారం సాయంత్రం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాసంలో రాష్ట్ర వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, డిప్యూటీ మేయర్ ఎ. గోపీనాథ్‌లతో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిత్తూరు నగరపాలక సంస్థ, గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అధిక శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి వైపు నిలుస్తున్నారని అన్నారు. అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థులకు తిరుగులేని విజయాలు లభించాయని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పనితీరును గమనిస్తున్న ప్రజలు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజా మద్దతు కోల్పోయిన వైకాపా నాయకులు అనవసర రాద్ధాంతాలు చేస్తూ ఎన్నికలకు ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసిందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులను అత్యధిక స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయాన్ని కానుకగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కూటమి మద్దతు ఇచ్చే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.ఈ సమావేశంలో కూటమి నాయకులు బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రఘు, రూప్ కుమార్, టిడిపి మహిళా అధ్యక్షురాలు లీలావతి,
టిడిపి ప్రధాన కార్యదర్శి పచ్చప్ప, తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్