ప్రభుత్వ సెలవు రోజున తరగతులు..* *గురుకుల్ పాఠశాలకు తాళం
*విద్యార్థి, ప్రజా సంఘాల ఫిర్యాదుతో స్పందించిన విద్యాశాఖ అధికారులు.. తరగతులు నిలిపివేత*
*చివ్వెంల, మేజర్ న్యూస్*
ప్రభుత్వ అధికారిక సెలవు దినమైన మంగళవారం తరగతులు నిర్వహిస్తున్న స్వామినారాయణ గురుకుల్ పాఠశాలపై విద్యార్థి, ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సంఘాల నాయకుల ఫిర్యాదుతో స్పందించిన విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడంతో తరగతులు నిలిచిపోయాయి.
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, స్వామినారాయణ గురుకుల్ పాఠశాల యాజమాన్యం తరగతులు నిర్వహిస్తున్నట్లు నాయకుల దృష్టికి వచ్చింది.
దీంతో జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి, లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ శివ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), చివ్వెంల మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు.
విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో పాఠశాల యాజమాన్యం తరగతులను నిలిపివేసి విద్యార్థులను ఇళ్లకు పంపించింది.
ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.