మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం
నంద్యాల అర్బన్: మహాత్మా గాంధీజీ 157వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ సత్యం, అహింస సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్ర్య ఉద్యమాన్ని శాంతియుత మార్గంలో నడిపించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీజీ అని పేర్కొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అనేక ప్రజా ఉద్యమాల ద్వారా దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారిలో స్వరాజ్య స్ఫూర్తిని నింపారని తెలిపారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింస, సహనం, సేవా భావం వంటి విలువలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సామరస్యం, శాంతియుత సమాజ నిర్మాణానికి గాంధీజీ ఆలోచనలు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారితో పాటు రిజర్వు ఇన్స్పెక్టర్ సురేష్ ,RSI కాళీ శ్రీ చరణ్, పోలీస్ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్ గారు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.