డ్రై డే నాడు కూడా మద్యం ఏరు...
మంగపేట, అక్టోబర్ 02, సూర్య(మేజర్ న్యూస్):గాంధీ జయంతి.. దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేసి మద్యపాన నిషేధం పాటించాల్సిన రోజు. కానీ మంగపేట మండలంలో మాత్రం ఆ నిబంధనలు కాగితాలకే పరిమిత మయ్యాయి. మండల వ్యాప్తంగా అనధికార బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మండలంలోని ప్రధాన గ్రామాలతో పాటు మారుమూల తండాలు, గూడేల్లో సైతం బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అధికారిక మద్యం దుకాణం లేకపోవడంతో , బెల్ట్ షాపులలో మాత్రం 24 గంటలు మద్యం ఏరులై పారుతోంది. గాంధీ జయంతి వంటి డ్రై డే రోజున కూడా ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా అమ్మకాలు జరగడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 అధిక ధరకు విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. ఈ బెల్ట్ షాపుల వెనుక ఎవరి హస్తం ఉంది? ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లో యువత మద్యానికి బానిసలవుతున్నారని, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని మహిళలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ప్రజల డిమాండ్
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, మండలంలోని అక్రమ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.