జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి- ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
-మంత్రి ఎన్ఎండి.ఫరూక్ కు వినతిపత్రం సమర్పించిన ఏపీయూడబ్ల్యూజే నంద్యాల జిల్లా కమిటీ సంఘం నేతలు
నంద్యాల అర్బన్: జర్నలిస్టుల చిరకాల కోరికలు, న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) నాయకులు కోరారు. ‘జర్నలిస్టుల కోరికల దినోత్సవం’ సందర్భంగా నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ, సమాజ హితం కోసం ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ నిరంతరం శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించడం, హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించడం, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయడం వంటి ప్రధాన డిమాండ్లను మంత్రి ఫరూక్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం స్వీకరించిన అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభంగా నిలిచే పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గౌరవాద్యక్షులు జనార్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మధుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ భాష రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఖండే శ్యాంసుందర్ లాల్ మరియు ఐజేయూ సంఘాల ముఖ్య నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.