మంగళగిరికి చేరుకున్న సేవా సంకల్ప యాత్ర
టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద రైడర్లకు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
ప్రజాసేవకే అంకితమైన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్
నరేంద్ర మోదీ గారి ఆయురారోగ్యాల కోసం తిరుమల నుంచి వారణాసి వరకు బైక్ యాత్ర చేస్తున్నామన్న శాప్ ఛైర్మన్ రవినాయుడు
ప్రధాని మోదీ క్షేమం కోరుతూ నారా లోకేష్ మార్గదర్శకంలో సేవా సంకల్ప బైక్ యాత్ర నిర్వహిస్తున్నామన్న వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్
ఏపీ సూర్య, స్టేట్ బ్యూరో : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని టీఎన్‌ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’ అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా యువత, విద్యార్థి విభాగం ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నేడు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సేవా సంకల్ప బైక్ రైడర్లకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి, నినాదాలతో రైడర్లలో నూతనోత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా *గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్* మాట్లాడుతూ.. దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా ప్రజలకు అందించిన నిస్వార్థ సేవలు దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవని కొనియాడారు. ఈ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని ఘనంగా స్మరించుకుంటూ, ఆయన చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన ‘సేవా సంకల్ప యాత్ర’ అభినందనీయమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు ఈ ‘సేవా సంకల్ప యాత్ర’కు శ్రీకారం చుట్టడం జరిగింది. 25 ఏళ్ల ప్రధాని ప్రజాసేవకు ప్రతీకగా, 25 సంవత్సరాల వయసున్న 25 మంది యువతీ యువకులు తిరుపతి నుంచి ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి వరకు ఈ యాత్రను చేపట్టడం విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రధానిగా మోదీ గారు ప్రతీ క్షణాన్ని ప్రజా సంక్షేమానికే అంకితం చేశారు. 'విజన్ 2047' లక్ష్యంతో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టేందుకు ఆయన వేస్తున్న అడుగులు నేడు అంతర్జాతీయ సమాజం సైతం గర్వించేలా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, నారా లోకేష్ గారి చొరవ, మోదీ గారి దూరదృష్టి సమన్వయంతో రాష్ట్రం, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమైన సుపరిపాలన అందిస్తున్న మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి వారణాసి వరకు సాగే ఈ ‘సేవా సంకల్ప యాత్ర’ విజయవంతం కావాలని, దేశ సమగ్రతకు, సేవా భావానికి ఇది మరింత ఊతం ఇవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం *శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు* మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా వరుసగా 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రజాసేవలో కొనసాగుతూ, ఇటీవల 75వ జన్మదిన వేడుకలు పూర్తి చేసుకున్న మహోన్నత నాయకుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని పేర్కొన్నారు. దేశ సమగ్రత, ఔన్నత్యం, సమగ్ర అభివృద్ధి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మోదీ గారిపై గౌరవంతో ఈ బృహత్తర బైక్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు నరేంద్ర మోదీ గారికి నిరంతరం ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్, యువనేత నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి నుంచి వారణాసి వరకు ఈ ‘సేవా సంకల్ప బైక్ యాత్ర’ను ప్రారంభించాం. మోదీ గారు ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సరిగ్గా 25 బైకులతో ఈ ప్రయాణం మొదలైంది. ఇందులో TNSF, తెలుగు యువత, నారా లోకేష్ గారి యువ బృందం నుంచి 25 మంది ప్రధాన రైడర్లు, మరో 25 మంది సహాయక బృందం కలిపి మొత్తం 50 మంది పాల్గొంటున్నారు. తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర విజయవంతంగా మూడో రోజుకు చేరుకుంది. మార్గమధ్యంలో తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తిని దర్శించుకున్నాం.. నేడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటున్నాం. పెన్నా, కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలను సేకరిస్తూ యాత్ర సాగిస్తున్నాం. రేపు తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, అక్కడి తీర్థప్రసాదాలను, పవిత్ర గోదావరి జలాలను స్వీకరిస్తాం. ఈ యాత్ర ఈ నెల 6వ తేదీ రాత్రికి వారణాసి చేరుకుంటుంది. 7వ తేదీ ఉదయం దక్షిణ భారత పవిత్ర నదీ జలాలతో కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తాం. నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే ఏకైక సంకల్పంతో నారా లోకేష్ గారి సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా, దిగ్విజయంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. *వీఎంఆర్డీఏ ఛైర్మన్ మానం వెంకట ప్రణవ్‌గోపాల్* మాట్లాడుతూ.. దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారి మార్గదర్శకంలో ఈ యాత్రను చేపట్టడం జరిగింది
. తిరుపతి అలిపిరి వేదికగా ప్రారంభమైన ఈ ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న ప్రముఖ దివ్య క్షేత్రాలన్నింటినీ దర్శించుకుంటున్నాం. ఆయా ఆలయాల దైవ ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రయాణ మార్గంలోని వివిధ పవిత్ర పుణ్య నదుల జలాలను సేకరిస్తున్నాం. ఈ పవిత్ర జలాలతో కాశీ విశ్వనాథుడి సన్నిధికి చేరుకుని స్వామివారికి విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నాం. బైక్ రైడర్స్ అందరం ఎంతో ఉత్సాహంతో, ఆధ్యాత్మిక భక్తిభావంతో, దేశ నాయకుడి క్షేమం కోసం ఈ బృహత్తర సంకల్ప యాత్రలో అడుగులు వేస్తున్నాం. యువతంతా ఒక్కటై నారా లోకేష్ గారి నాయకత్వంలో చేపట్టిన ఈ బైక్ యాత్ర నిర్విఘ్నంగా పూర్తయి, కాశీ విశ్వనాథుని అనుగ్రహంతో దేశం, రాష్ట్రం మరింత సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండి రాకేష్, ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఏపీ లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయంపాలెం విజయకుమార్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాం ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.