బీసిల రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు బిజెపి నేత గాలి హరిప్రసాద్
బీసి రిజర్వేషన్లపై రాద్ధాంతం తగదు
- బిజెపి నేత గాలి హరిప్రసాద్
- బీసిలకు న్యాయం చేకూర్చడమే కూటమి ధ్యేయం
వేంపల్లె మేజర్ న్యూస్:
బీసి రిజర్వేషన్ల విషయంపై ప్రతిపక్షాల విమర్శలు, రాద్ధాంతం తగదని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా వాస్తవాలకు ఆధారంగా ఉండాలన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే కాకుండా స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం.. సామాజిక న్యాయంలో కీలక భాగమన్నారు. బీసిల జనాభా రాష్ట్ర మొత్తంగా సుమారు 50.42 శాతం ఉందని, హైకోర్టుకు సమర్పించిన సమకాలీన కుటుంబ సర్వే వివరాలను కూటమి ప్రభుత్వం ఉటంకించిదన్నారు. స్థానిక సంస్థల్లో బీసిలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే అవసరాన్ని ప్రభుత్వం వివరించిందన్నారు. హైకోర్టు తీర్పును రాజకీయ ఆయుధంగా మార్చకుండా బీసిలకు శాస్వతమైన, న్యాయపరంగా నిలబడే రిజర్వేషన్ వ్యవస్థ తీసుకు వచ్చేందుకు నిర్మాణాత్మక కార్యచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఓటు బ్యాంక్ కాకుండా నిర్ణయాధికారంలో బీసిలకు భాగస్వామ్యం చేయాలన్నారు. బీసిల హక్కుల విషయంపై రాజకీయ స్వలాభం కాకుండా సామాజిక న్యాయం చేకూర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. బీసిల ప్రాతినిధ్యం తగ్గకుండా, హక్కులు బలహీన పడకుండా చట్టబద్ధమైన న్యాయం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అన్నారు.