జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మునుగోడులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం
మునుగోడు,మేజర్ న్యూస్:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ, జర్నలిస్టుల హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి ఆదేశానుసారం శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు)జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కుంభం ఇంద్రసేనారెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముడుపు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి,నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.నూతన మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలన్నారు.పాత్రికేయుల భద్రత కోసం జాతీయ చట్టం తీసుకరావాలనీ,
రద్దు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల క్రింద చట్టబద్దమైన హక్కులను పునఃరుద్ధ రించాలి. కొత్త వేతన మండలి ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాలాలో అర్హులైన జర్నలిస్టులందరికి ఇల్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టులకు ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగానే "హెల్త్ కార్డులు అందించి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ను అందించాలనీ కోరారు. జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతూ, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయు) మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు జాజుల స్వామి గౌడ్,మండల నాయకులు మార్నేని ప్రభాకర్,పెరుమాళ్ళ ప్రమోద కుమార్,రెడ్డిమల్ల వెంకట్, పంపాటి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.