మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం
మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, దిగువమెట్ట మీదుగా కొత్త రైలు ప్రవేశపెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రైల్వే, సమాచార & ప్రసార, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖా మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించారు. ప్రయాణికుల అవసరాలు, రైలు సేవల నిర్వహణ అవసరాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలు నిరంతరం సేవలను విస్తరిస్తూ, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు మరియు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. మచిలీపట్నం – కర్నూలు సిటీ మధ్య దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంభం, దిగువమెట్ట మీదుగా కొత్త రైలు సేవకు ఆమోదం లభించడం పట్ల ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు సేవ ప్రారంభంతో ప్రకాశం, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు, ప్రాంతీయ రవాణా అనుసంధానం బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.