అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్
(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
అనంతపురం నగర అభివృద్ధిలో భాగంగా పింక్ టాయిలెట్ల ఏర్పాటుకు టెండర్ కాల్‌కు అహుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, వైస్ చైర్పర్సన్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అహుడా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనధికార లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న లేఅవుట్లపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
కోడూరు లేఅవుట్ అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే పీపీపీ విధానంలో చేపట్టనున్న ప్రాజెక్టులను వేగవంతం చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో చైర్మన్ టి.సి. వరుణ్ అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అహుడ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.