క్షయవ్యాధి నియంత్రణకు మెరుగైన వైద్యసేవలు
ఉదయగిరి, మేజర్ న్యూస్ : సమాజంలో క్షయవ్యాధి నియంత్రణకు అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ అర్జుసెల్వన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా క్షయవ్యాధి నియంత్రణాధికారి ఖాదర్వలీ ఆధ్వర్యంలో ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలోని క్షయ నియంత్రణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలు రికార్డులు, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి తగు సూచనలు, సలహాలు అందజేవారు. అనంతరం మండలంలోని బండగానిపల్లి ఆయుష్మాన్ భారత్ మందిర్ను తనిఖీ చేశారు. గ్రామాల్లో క్షయవ్యాధిగ్రస్తులను కలిసి వారికి అందుతున్న వైద్యసేవలను తెలుసుకుని సిబ్బందిని అభినందించారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు మింగాలన్నారు. క్షయవ్యాధి మందులతో నయమవుతుందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రవీంద్ర, డీపీఎస్ శ్రావణ్, టీబీ సూపర్వైజర్ భోగ్యం వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.