క్రీడలతో యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.
అనపర్తి మేజర్ న్యూస్. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించే లక్ష్యంతో అనపర్తిలోని జీబీఆర్ విద్యాసంస్థల్లో శుక్రవారం స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ ఈస్ట్ గోదావరి జిల్లా విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలకు కబడ్డీ, పరుగు పందెం పోటీలు, బాలురకు వాలీబాల్, పరుగు పందెం పోటీలను నిర్వహించారు. విద్యార్థులు క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అబ్బాయిరెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వామి, డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఆనంద్ బహుమతులు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టి, 2029 నాటికి డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి క్రీడలు, విద్య, సామాజిక సేవ వైపు ప్రోత్సహించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక వికాసానికి, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి దోహదపడతాయని అన్నారు. క్రీడల ద్వారా ఓటమిని స్వీకరించే మనస్తత్వం, గెలుపు కోసం కష్టపడే పట్టుదల, జట్టుగా పనిచేసే నాయకత్వ లక్షణాలు అలవడతాయని వివరించారు. విద్యార్థులు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకుని దేశ అభ్యున్నతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.యువతకు సరైన మార్గదర్శకత్వం, తగిన అవకాశాలు కల్పిస్తే సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్ పుష్ప, డిగ్రీ కళాశాల అధ్యాపకులు రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆనంద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.