కొత్త కుళాయి చెరువు సుందరీకరణకు రూ.5.60 కోట్లు త్వరలో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు 14 కోట్ల నిధులు మంజూరు.
పాలకొల్లు, మేజర్ న్యూస్:- పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కొత్త కుళాయి చెరువు గట్టును పటిష్ఠం చేసి, పరిసర ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా సుందరీకరించేందుకు రూ.5.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ నాయకులు, సభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని శాలువాలతో సత్కరించి కూరగాయలు బహుమతిగా అందించారు.ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ప్రతిఒక్కరి జీవితంలో నడక ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో నడక ఉపయోగపడుతుందన్నారు. వాకర్స్ క్లబ్ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వారి సౌకర్యార్థం చెరువు పరిసర ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.పాలకొల్లు పట్టణంలోని రిజర్వు స్థలాల్లో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు చొప్పున నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలకు ప్రతిఫలంగా వారి అవసరాలను తీర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని, ఎన్నికల్లో ప్రజలు అందించే మెజార్టీ తనపై మరింత బాధ్యతను పెంచుతుందని పేర్కొన్నారు.వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ, “అడక్కుండానే అమ్మయినా అన్నం పెట్టదు” అనే సామెతకు భిన్నంగా, ప్రజలు తమ సమస్యలను చెప్పకముందే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ప్రజానాయకుడు మంత్రి నిమ్మల రామానాయుడు అని కొనియాడారు. కొత్త కుళాయి చెరువు వద్ద నడక సాగించేందుకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి, తాము అడగకముందే అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. రూ.5.60 కోట్లతో చెరువు గట్టును పటిష్ఠం చేసి, పరిసరాలను సుందరీకరించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసేవ కోసం మంత్రి చేస్తున్న కృషి, పట్టుదల ఇతర నాయకులకు ఆదర్శమని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నందుకు వాకర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షులు మానెం బసవరాజు, ధనాని శ్రీరామమూర్తి, ఫాస్ట్ గవర్నర్ జి.వీ. సుబ్బారావు, సభ్యులు ధనాని సూర్య ప్రకాష్, జంపన నాగేంద్ర ప్రసాద్, బాసిన సత్యనారాయణ, జవ్వాజి కల్యాణ్, చామా శ్రీనివాసరావు, సోమంచి శ్రీనివాసశాస్త్రి, క్రొవ్విడి సూర్యనారాయణ, టంగుటూరి నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు, డాక్టర్ శివ ప్రసాద్, ల్యాబ్ సత్యం, మాఘం శ్రీధర్, మాఘం శివ, మాఘం రామకృష్ణ, రమణా రెడ్డి, బొల్లోజు విజయ్, సముద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.