నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆమదాలవలస, అక్టోబర్ 27, మేజర్ న్యూస్
తుఫాను ప్రభావం వలన నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఎస్.బాలరాజు తెలిపారు. ఆమదాలవలస మండలం నిమ్మతర్లాడ, ముద్దాడ పేట, సిరిసింపేట గ్రామాల్లో మంగళవారం పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. తుఫాను వలన అతి భారీ వర్షాలు కురవడంతో నాగావళి నదికి వరద నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. వరద నీటి ప్రవాహం వస్తే నదీ తీర గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, నది తీరం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తుఫాన్ వలన భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ప్రజల ఉండాలని, బయట సంచారం చేయరాదని సూచించారు. ఇంటికి అవసరమైన వస్తువులు, సామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.