కోటియా వివాదాస్పద గ్రామాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
పార్వతీపురం, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, ఆదేశాల మేరకు, పార్వతీపురం సబ్ డివిజన్ డీఎస్పీ సిహెచ్.వి. శేషయ్య ఆధ్వర్యంలో పోలీసులు కోటియా వివాదాస్పద గ్రామాల పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను పరిరక్షించడం, అక్రమ మద్యం తయారీ వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు.సాలూరు మండలంలోని కోటియా వివాదాస్పద గ్రామాలైన దొర్లరాడివలస, ములతాడివలస, దూలిభద్ర గ్రామాల పరిసర ప్రాంతాల్లోని కొండల్లో నాటుసారా తయారీ జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నాటుసారా తయారీకి ఉపయోగించే స్థావరాలను గుర్తించి, అక్రమ తయారీని అరికట్టేందుకు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నాటుసారా తయారీకి ఉపయోగిస్తున్న 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 2,800 లీటర్ల బెల్లం ఊటతో పాటు 3 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి విలువ సుమారు రూ.1,00,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నాటుసారా తయారీలో పాల్గొంటున్న వ్యక్తులు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. పరారైన వ్యక్తులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సిహెచ్.వి. శేషయ్య వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా నాటుసారా తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం వంటి కార్యకలాపాలపై పోలీసు శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని తెలిపారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ నాటుసారా తయారీ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు.ఈ దాడులు, తనిఖీల్లో పార్వతీపురం సబ్ డివిజన్ డీఎస్పీ సిఎచ్.వి. శేషయ్య, సాలూరు సీఐ పి. రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్‌ఐ బి. రవీంద్ర రాజు, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తో పాటు సుమారు 30 మంది(ఎస్ టి ఎఫ్ ఈగల్) పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.