కూటమి ఐక్యతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
అనకాపల్లి ప్రతినిధి ,సెప్టెంబర్ 27, మేజర్ న్యూస్ :
బూత్ స్థాయి నుంచే పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమి ముఖ్య నాయకులతో అనకాపల్లిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు,కూటమి కుటుంబ సభ్యులు , కార్యకర్తలు పూర్తి సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కూటమి మూడు పార్టీలు పేరుకే వేర్వేరు పార్టీలైనా, ఎన్నికల సమయంలో ఒక కుటుంబంలా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అధిష్టానం ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి అవకాశం కల్పించినా వ్యక్తిగత అభిప్రాయాలు, ఆశలు పక్కన పెట్టి కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,. అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశాలపై ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలని కొణతాల తెలిపారు. స్థానిక సంస్థలే రాజకీయాలకు బలమైన పునాదిvఅని కొణతాల తెలిపారు. , ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం మాత్రమే కాకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కూటమి సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, కార్పొరేటర్, మేయర్ తదితర స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు.ప్రతి వార్డులో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసి వార్డు స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి బూత్‌కు సంబంధించిన కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, క్రియాశీలక సభ్యుల వివరాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. మారిన వార్డు పరిధులు, పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా బూత్ కమిటీలను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పటి నుంచే బూత్ స్థాయి కార్యాచరణ ప్రారంభిస్తే నోటిఫికేషన్ వెలువడే సమయానికి కూటమి ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఖరారైన తర్వాత ప్రచారానికి లభించే సమయం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు క్షేత్రస్థాయి పని ఎంతో కీలకమన్నారు.
ఎవరు అభ్యర్థి అన్నది తర్వాతి విషయం.. కూటమి గెలుపే మనందరి ప్రధాన లక్ష్యం. ఒకే మాట, ఒకే బాటతో బూత్ స్థాయి నుంచి పనిచేస్తే స్థానిక సంస్థల్లో బలమైన పునాది నిర్మించగలం* అని కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా పరస్పర సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గం పరిధి కూటమి నాయకులు, మహిళలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.