ట్రిపుల్ ఐటీ మెస్‌ను తనిఖీ చేసిన ఎంపీ కలిశెట్టి
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27 మేజర్ న్యూస్:
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ మెస్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, ఇతర వసతులు చాలా బాగున్నాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించి, మెస్‌ను అకస్మాత్తుగా తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం నాణ్యతగా అందుతున్నాయని, క్యాంపస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటూ చదువుకు ఎంతో అనుకూలంగా ఉందని విద్యార్థులు ఎంపీకి వివరించారు.
అనంతరం విద్యార్థుల బాగోగులు అడిగి తెలుసుకున్న ఎంపీ, క్యాంపస్‌లో కల్పిస్తున్న వసతులపై హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి విద్యార్ధులు వారి ఊరికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, పరిపాలనా అధికారి డాక్టర్ ముని రామకృష్ణ, ఆర్థికాధికారి డాక్టర్ వాసు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జి లంక శ్యామల రావు, పలువురు కూటమి నాయకులు, డీన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.