కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’
తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే (బిఎల్ఏలు) పార్టీకి నిజమైన మూలస్తంభాలని, వారికి పార్టీ మరియు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా పాలనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన బిఎల్ఏలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం నిర్వహించిన చింతకాని మండల కాంగ్రెస్ బిఎల్ఏల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చింతకాని మండలంలోని బిఎల్ఏల పనితీరు, శ్రమ మిగతా మండలాల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, కాంగ్రెస్ ప్రభావాన్ని పెంచేందుకు శ్రమిస్తున్న ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్త శ్రమకు తగిన గౌరవం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటీకి చేర్చి ప్రజా పాలనకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత బిఎల్ఏలపైనే ఉందన్నారు.
గత 10 ఏళ్లలో మన ప్రభుత్వం లేకపోవడం వల్ల మధిర నియోజకవర్గంలో అభివృద్ధి వెనుకబడిందని, గత 10 సంవత్సరాలు మరియు ఈ 5 సంవత్సరాలు కలిపి మొత్తం 15 ఏళ్ల నాటి అభివృద్ధిని కేవలం ఈ 5 ఏళ్ల కాలంలోనే కాలంతో పోటీ పడి పూర్తి చేద్దామని అన్నారు.
రాబోయే రెండేళ్లలో పాఠశాలలు, రోడ్లు, ఆసుపత్రులు వంటి అన్ని పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి, నాయకులు గ్రామాల్లో తలఎత్తుకొని తిరిగేలా చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 1 కోటి 6 లక్షల కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ నెలకు 6 కేజీల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, ఇది దేశంలోనే ఆదర్శవంతమైన 'తెలంగాణ మోడల్' అని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆర్థిక ఊరట కల్పించడమే కాకుండా, డ్వాక్రా రుణాల పునరుద్ధరణ చేపట్టి లక్ష కోట్ల రుణాలు ఇచ్చే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండటంతో గ్రామాల్లో 80 నుంచి 90 శాతం మంది ఒక్క రూపాయి బిల్లు లేకుండా నాణ్యమైన విద్యుత్ పొందుతున్నారని కొనియాడారు. పేదల వైద్యం కోసం 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచామని, రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఉచితంగా రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
విద్యారంగంలో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేసి, నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు జమచేసే విప్లవాత్మక విధానం తెచ్చామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వేడి అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్'ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు వివరించారు. రైతుల రుణమాఫీతో పాటు ఎకరానికి రూ. 12 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు.
ఈ ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు.