ఎస్‌ఐఆర్’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ బ్యూరో ప్రతినిధి
: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై నెలకొన్న అనుమానాలకు ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై వచ్చిన నివేదికలు తమ ఆందోళనలకు మరింత బలం చేకూరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం పారదర్శకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల ఆమోదంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా ప్రధాన డిమాండ్‌గా సెప్టెంబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉదయం 10.30 గంటలకు నిరసన కార్యక్రమం ప్రారంభించి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు.