కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
సూర్య మేజర్ న్యూస్ : స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన గళం విప్పాయి. ఏఐసీసీ, పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. గత ఎనిమిది దశాబ్దాలుగా ఎంతో పవిత్రంగా కొనసాగుతున్న ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చారని మండిపడుతూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తొత్తుగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మోదీ సర్కారుకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తూ వ్యవస్థ పవిత్రతను దెబ్బతీశారని దుయ్యబట్టారు. స్వతంత్ర ఎన్నికల నిర్వహణలో విశ్వసనీయత కాపాడలేని వ్యక్తి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేసి వైదొలగాలని నినదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో అమలాపురం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కేకేసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంటెద్దు బాబి, ఏఐసీసీ సభ్యులు యార్లగడ్డ రవీంద్ర, సీనియర్ నేతలు ముషిణి రామకృష్ణారావు, కోట శ్రీనివాసరావు, కుడుపూడి శ్రీనివాసరావు, ఏలేశ్వరం రాధాకృష్ణ, మహబూబ్ షకీలా, ధోనిపాటి విజయలక్ష్మి, వడ్డీ నాగేశ్వరరావు, దేవరపల్లి రాజేంద్ర బాబు, గెడ్డం సురేష్ బాబు, మాచవరపు శివన్నారాయణ, నిమ్మకాయల ప్రసాద్, పోలిశెట్టి హరిబాబు, పేరి శర్మ, నెల్లి వెంకటరమణ, మలపర్తి మోహన్రావు, కొల్లు సరోజిని, రుద్రరాజు గోపాలకృష్ణరాజు, చిలకపాటి శ్రీధర్, రౌతు ఈశ్వరరావు, ప్రసన్న కుమార్, బత్తుల పండు, మంచాల రామకృష్ణ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.