కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం
అనంతపురం బ్యూరో : రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ‘హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బి.కె.పల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘన స్వాగతం పలికారు.
రాయలసీమ స్వర్ణ భవిష్యత్తు లక్ష్యంగా రూ.లక్ష కోట్ల అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టడంతో పాటు, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ప్రణాళిక ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగ అభివృద్ధికి, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, అనుబంధ రంగాల పురోగతికి సంబంధించి ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి సంబంధించి చేపడుతున్న ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొన్నారు.