కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
విజయనగరం/రాజాం, అక్టోబర్ 24, మేజర్ న్యూస్:
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో రాజాంలోని డీఏవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ కేంద్రంలో రాజాం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, వంగర మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ రిసెప్షన్, భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కోసం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన గదులను కేటాయించి, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు తగిన స్థలం కేటాయించాలని, విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన భోజన, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని తెలిపారు. ఎన్నికల సామగ్రి భద్రతకు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు, అపోహలకు తావులేకుండా ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పూర్తి పారదర్శకతతో కౌంటింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్డీవో సుధారాణి, రాజాం తహసీల్దార్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ బ్యూరో విజయనగరం