కన్నాపురం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన చింతమనేని నవ్యశ్రీ- కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు వినతి
పెదవేగి, మేజర్ న్యూస్ : పెదవేగి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఆదివారం సాయంత్రం తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. పెదవేగి మండలం కన్నాపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆమె గ్రామంలోని ప్రతి గడపకూ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. పెదవేగి జెడ్పీటీసీగా తనను భారీ మెజారిటీతో గెలిపించడంతో పాటు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ ఏకపక్షంగా ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీకి కన్నాపురం గ్రామ ప్రజలు, మహిళలు అపూర్వ రీతిలో బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటా ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ.. మంగళహారతులు పట్టి, నుదుట కుంకుమ దిద్ది సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజలు చూపించిన అంతులేని వాత్సల్యంతో తొలిరోజే ప్రచార పర్వం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఏఎంసీ చైర్పర్సన్ గారపాటి రామసీత , మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్ సహా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.