కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
- సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
- ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్
మదనపల్లె : రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనకు ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ సంఘీభావం తెలిపారు.మంగళవారం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.శాశ్వత ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా కాకుండా న్యాయమైన విధానంలో రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని,అప్పటి వరకు వారికి పూర్తి వేతనాలు,ఈపీఎఫ్,ఈఎస్ఐ తదితర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని కోరారు.కాంట్రాక్ట్ ఉద్యోగులకు మెడికల్ లీవ్,ఆరోగ్య సదుపాయాలు,కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డు,బదిలీ సౌకర్యం వంటి ప్రాథమిక ఉద్యోగ హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి తగిన పరిహారం,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విధానాన్ని అమలు చేయాలని కోరారు.వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ,కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించడంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని,ఉద్యోగులపై ఎటువంటి వేధింపులు లేదా ప్రతీకార చర్యలు తీసుకోకుండా సానుకూలంగా స్పందించాలని ఏఐటీయూసీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఏఐటీయూసీ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి ముబారక్,మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల తదితరులు పాల్గొన్నారు.