కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి
-- కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
మేజర్ న్యూస్- శ్రీకాకుళం : శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధా రాణితో పాటు కూటమి కార్పోరేటర్లను గెలిపించాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని 27, 28, 31, 32, 33, 34, 35, 36, 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్ల పరిధిలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్ర మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణితో పాటు ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు శ్రీకాకుళం నగరాన్ని కూడా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలంటే కార్పొరేషన్‌లోనూ కూటమి పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో శ్రీకాకుళం నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణితో పాటు కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.