జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరికాన భవానీకి మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
కోటబొమ్మాళి, నవంబర్ 20, మేజర్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జనసేన నాయకురాలు కొరికాన భవానీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి తరఫున జిల్లా పరిషత్ పీఠానికి ఎంపికైన భవానీ, తన భర్త మరియు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్‌తో కలిసి శుక్రవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఆమె అధికారికంగా చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నూతన చైర్‌పర్సన్‌కు సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతో జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని దిశానిర్దేశం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని, మన్ననలను పొందాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.