BREAKING
పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షునిగా శెట్టి. అప్పలరాజు నియామకం పై హర్షం... ఎన్నికల సామాగ్రి పంపిణీ ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో రామ్ మోహన్ రావు నేడే రాజాం మున్సిపల్ పోరు....... నేడు సర్పంచ్ ఎన్నికలు.. ఎవరిని వరిస్తుందో ఆ పీఠం! మగ్గూరు గ్రామంలో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం ప్రారంభం గ్రామఅభివృద్ధికి పనిచేస్తా ఆశీర్వదించి ఓటెయ్యండి మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే కొల్లాయి వలస సర్పంచ్ పీఠం వందనాలకు విజయం వరించే నా.. ప్రజాక్షేత్రంలో అడ్రస్ లేని వైసీపీ నామినేషన్ తిరస్కరణ పేరుతో సానుభూతి నాటకం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి తొలి సమరం నేడే నేడు పంచాయతీ పోరు.. అభ్యర్థుల గుండెల్లో బేజారు గజపతినగరం మేజర్ పంచాయతీలో కళావతి ధీమా రాజాం ప్రగతికి ప్రజా మద్దతు కోరిన రాజ్యసభ సభ్యులు " చింతకాయల ",ఎమ్మెల్యే " కోండ్రు " బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, శర్వరి జోడీ మ్యాజిక్.. యే ప్రేమ్ మోల్ లియా తొలిరోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే

జీతం ఫుల్.. డ్యూటీ డల్!

Select Suryaa Now
జీతం ఫుల్.. డ్యూటీ డల్!

( విజయనగరం బ్యూరో, మేజర్ న్యూస్ )

వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతోంది. కొనుగోలు చేసే ప్రతి వస్తువులోనూ ఎక్కడో ఒకచోట మోసం జరుగుతోంది. కొన్నిచోట్ల తూకంలో తేడా.. మరికొన్నిచోట్ల కొలతల్లో కోత.. ఇంకొన్నిచోట్ల నాణ్యతలో లోపం! అయినా సంబంధిత శాఖకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. మార్కెట్లో మోసాలు యథేచ్ఛగా సాగుతున్నా అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన తూనికలు–కొలతల శాఖ అసలు పనిచేస్తోందా? లేక కార్యాలయానికే పరిమితమైందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

విజయనగరం జిల్లాలో ఈ శాఖ పనితీరు చూస్తుంటే ఉండీ లేనట్లే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా మార్కెట్లో తనిఖీలు నిర్వహించిన దాఖలాలు, అక్రమాలపై కేసులు నమోదు చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదన్నది వినియోగదారుల ప్రధాన ఆరోపణ. దీన్నిబట్టి మార్కెట్లో ఎక్కడా అక్రమాలు జరగడం లేదని భావించాలా? లేక జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
నిద్ర నటిస్తున్నారా?
తూనికలు–కొలతల శాఖ అంటే కేవలం కార్యాలయానికి పరిమితమయ్యే విభాగం కాదు. వినియోగదారుడికి ప్రతి రూపాయికీ తగిన పరిమాణంలో వస్తువు అందుతోందా లేదా అన్నది నిర్ధారించాల్సిన కీలక బాధ్యత ఈ శాఖపై ఉంది. వ్యాపార సంస్థల్లో ఉపయోగించే తూనిక యంత్రాలు, కొలత పరికరాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా పరిశీలించాలి. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కానీ విజయనగరం జిల్లాలో ఈ బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఉదయం ఇంటికి పాలు పోసే వ్యక్తి దగ్గర నుంచి కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణం, సూపర్ మార్కెట్ వరకు వినియోగదారుడికి తూనికల్లో మోసం జరిగే అవకాశాలు లేకపోలేదు. పాల వ్యాపారులు కొలతల పాత్రలకు బదులు సీసాలనే ప్రామాణికంగా తీసుకోవడం, కూరగాయల వ్యాపారులు నిర్దేశిత ప్రమాణాలున్న తూనిక రాళ్లకు బదులు ఇతర బరువులను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు వినియోగిస్తున్న దుకాణాల్లోనూ వాటి పనితీరుపై పర్యవేక్షణ అవసరమని వినియోగదారులు చెబుతున్నారు.

ఒక దుకాణంలో కొనుగోలు చేసిన వస్తువును మరోచోట తూకం వేయిస్తే తేడా కనిపిస్తోందన్న ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తూనికలు–కొలతల శాఖ అధికారులు ఎక్కడున్నారు? మార్కెట్లో ఏం జరుగుతోందో కనీసం పరిశీలిస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉంది.

రాజముద్ర వేయించకపోతే చర్యలేవీ?

వ్యాపారులు వినియోగించే తూనికలు, కొలతల పరికరాలకు నిర్దేశిత కాల వ్యవధిలో ధ్రువీకరణ చేయించడం, వాటిపై అధికారిక ముద్ర వేయించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలు, తూనిక రాళ్లు, కొలత పాత్రలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలి. కానీ జిల్లాలో ఎన్ని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు? ఎన్ని యంత్రాలను పరిశీలించారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారు? అన్న వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉంది.

మరోవైపు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల విషయంలోనూ వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్యాకెట్‌పై ముద్రించిన బరువు, ధర, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను పరిశీలించేలా ప్రజలకు సూచించాలి. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిగితే సంబంధిత విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ జరగాల్సిన పనులే తప్ప అదనపు బాధ్యతలు కావు.

జీతాలకు ఢోకా లేదు.. విధులకు దిక్కేది?

జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యాలయం.. అందులో అధికారులు, సిబ్బంది.. ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతి నెలా జీతభత్యాలు! కానీ ప్రజలకు అందాల్సిన సేవల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత ఉన్నా, అందుబాటులో ఉన్న అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు నిర్వహించవచ్చుకదా అన్నది వినియోగదారుల వాదన.

రోజుకు కనీసం నాలుగు దుకాణాలను తనిఖీ చేసినా మార్కెట్లో కొంతమేర క్రమశిక్షణ తీసుకురావచ్చని అంటున్నారు. వారానికి ఒకరోజైనా వినియోగదారుల సంఘాలు, మండళ్లతో సమావేశాలు నిర్వహించి తూనికలు–కొలతలు, వస్తువుల నాణ్యత, ఆహార భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా కనిపించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత సమయం గడుపుతున్నారు? తనిఖీలకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారు? కార్యాలయ కార్యకలాపాలకే పరిమితమవుతున్నారా? అన్న అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు వ్యాపారుల నుంచి ప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవు. ఈ అంశంపైనా సంబంధిత శాఖ పారదర్శకంగా స్పందించాల్సి ఉంది.
నిద్ర మేల్కొనండి మహాశయులారా!

వినియోగదారుడు ప్రతి వస్తువు కొనుగోలులోనూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూకం సరిగా ఉందో లేదో, కొలతల్లో మోసం జరుగుతోందో లేదో స్వయంగా పరిశీలించుకోవాల్సి వస్తోంది. నిజానికి ఇవన్నీ నిర్ధారించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. అందులోనూ తూనికలు–కొలతల శాఖది మరింత కీలకమైన పాత్ర.
ఇప్పటికైనా అధికారులు కార్యాలయాల గడప దాటి మార్కెట్లలోకి రావాలి. దుకాణాలను తనిఖీ చేయాలి. తూకాల్లో తేడాలు గుర్తించాలి. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. వినియోగదారుల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలి.

ప్రజాధనం నుంచి జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కూడా అధికారులదే. అసలు జిల్లాలో తూనికలు–కొలతల శాఖ ఎన్ని తనిఖీలు నిర్వహించింది? ఎన్ని కేసులు నమోదు చేసింది? ఎన్ని అక్రమాలను గుర్తించింది? ఈ వివరాలను బహిర్గతం చేయాలి. లేకపోతే ప్రజలకు న్యాయం చేయాల్సిన శాఖే నిద్రావస్థలో ఉందన్న విమర్శలకు సమాధానం చెప్పడం కష్టమే. ఇప్పటికైనా నిద్ర మేల్కొంటారో.. లేక మేల్కొన్నట్లు నటిస్తారో వేచి చూడాల్సిందే!