జెడ్పీ కార్యాలయంపై టీడీపీ జెండా రెపరెపలు ఖాయం
నెల్లూరు, మేజర్ న్యూస్ : జిల్లాలోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ విజయాలు సాధించబోతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర పరిశీలకుడు డూండి రాకేష్‌తో కలిసి సోమిరెడ్డి అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భారీ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. పార్టీ అభ్యర్థులు ప్రజల మద్దతుతో విజయం సాధించి జిల్లా పరిషత్‌పై టీడీపీ జెండా ఎగురవేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.