జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహాచండీ దేవిగా దర్శనమిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ సన్నిధిలో బుధవారం సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళావేదికపై ఉదయం10 గంటల నుంచి రాత్రి వరకు సంగీత, నృత్య, భజన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి. కొండపై అమ్మవారి దివ్యాలంకారం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తగా, కొండదిగువన కళాకారుల ప్రదర్శనలతో ప్రాంగణమంతా భక్తిరసంతో మార్మోగింది. టి. వెంకటేశ్వరరావు బృందం సమర్పించిన గ్రామీణ తాళ భజన భక్తులను ఆకట్టుకుంది. ఎం. రూప నాగ తేజస్వి, కె. జగన్మోహిని, పి. పరమేశ్వరి, యు. కల్యాణి హేమలత, కె. రుద్రాంక్షి ఆలపించిన భక్తిరంజని సంకీర్తనలు, దేవీ స్తోత్రాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ప్రముఖ హరికథా విద్వాంసుడు ఎం. బాల సుందరం దేవీ లీలలను వివరిస్తూ చేసిన హరికథా గానం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు, యువ కళాకారులు కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలతో అలరించారు. పి. ఓమన, జి. శ్రీనివాస్, ఎస్. రమ్య, ఎం.వి.ఎస్. వైష్ణవి, టి. సాయి రాగమాలిక, ఎస్. అనన్య, ఎ. యోచిత, ఎం. అనూష నాయుడు, ఎం. సింధు రావళి, ఎం. భావన, వి. జానకి, కె. సాహితి లక్ష్మి, ఎం. సుప్రియ, ఎస్.కె. అలేఖ్య, పి. సరస్వతి, పి. వరుణ్ శర్మ తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. లయబద్ధమైన అడుగులు, అభినయం, భావప్రకటనతో శివశక్తి తాండవ రూపకాలను ఆవిష్కరించారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను దేవస్థానం అధికారులు అభినందించి, అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.