జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉపకార వేతనాల కోసం జాతీయ ఉపకార వేతనాల పోర్టల్ ద్వారా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి పి. వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న అర్హులైన ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు), ఈబీసీ (ఆర్థికంగా వెనుకబడిన తరగతులు), డీఎన్టీ (సంచార, విముక్త తెగలు) విద్యార్థినీ విద్యార్థులు తమ సంబంధిత విద్యాసంస్థల ద్వారా జాతీయ ఉపకార వేతనాల పోర్టల్‌లో కొత్త దరఖాస్తులు, పునరుద్ధరణ దరఖాస్తులను సమర్పించాలన్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15, 2026 చివరి తేదీ అని స్పష్టం చేశారు.
అదేవిధంగా సంబంధిత పాఠశాలలు, కళాశాలల సంస్థాగత నోడల్ అధికారులు, విద్యాసంస్థల ప్రధానాధికారులు, నోడల్ అధికారులు వేలిముద్రల ద్వారా అధికార నిర్ధారణ, ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తమ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి, ధ్రువీకరణ పూర్తి చేసి, జాతీయ ఉపకార వేతనాల పోర్టల్ ద్వారా జిల్లా బీసీ సంక్షేమ అధికారి కార్యాలయానికి పంపించాలని కోరారు.
మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
- 92909 29699
- 91823 94143
ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారి పి. వెంకటలక్ష్మమ్మ విజ్ఞప్తి చేశారు.